Stuvartpuram Police Station

అతడు తాపీగా, “ఇంతేనా? నువ్వు చెప్పవలసింది ఇంకేమైనా వున్నదా?” అని అడిగాడు. తరువాత లేచి ఆమెవైపు చూస్తూ అన్నాడు. “నువ్వు చాలా గొప్ప దానివని నీ అభిప్రాయం. నువ్వేకాదు నీలాటి స్త్రీలు చాలామంది అలానే అనుకుంటూ వుంటారు. తాము ప్రపంచాన్నీ, అందులోని చాలామంది మొగవాళ్ళనీ చూశామని అనుకుంటారు. నీలాటి స్త్రీలు రాజకీయాల్లో ఎక్కువగా వున్నా, బయట ప్రపంచంలో కూడా చాలా మంది వుంటారు. వీళ్ళు ఎక్కడా ఇమడలేరు. ఒక్క స్నేహితుడితో ప్రారంభమైన మీలాటి వాళ్ళ జీవితం ఎన్నో మజిలీల్లో ఆగుతుంది. ఒక్కొక్క మజిలీ మీరు ఒక్కొక్క అనుభవంగా భావించి, ఎదిగిపోయామని అనుకుంటారు. ఒక మొగవాడు తనకి ఒక స్త్రీ దొరకటం గొప్ప వరంగా భావిస్తాడు. అలాటి తొట్టిగ్యాంగు, నీచమైన గ్యాంగు అంతా మీ చుట్టూ చేరి మీకు లేని గొప్పదనాన్ని కలిగిస్తారు. వీళ్ళంతా మీ శరీరం మీది వ్యామోహంతో మీ చుట్టూ చేరతారు. కొంతమంది మిమ్మల్ని ప్రేమిస్తారు కూడా. కానీ ఆ ప్రేమంతా వాళ్ళు తమ బాధలు మీతో చెప్పుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాటి మొగవాళ్ళు మీకు నచ్చరు. అప్పటికే మీ గురించి నలుగురికీ తెలుస్తుంది. నలుగురికీ తెలిసిందని మీకూ తెలుస్తుంది. మీ మనసుతో మీకు మంచి సంబంధాలు వుండవు. విసుగూ, చిరాకూ ఎక్కువ అవుతుంది. మొగవాడికి ఒక అనుభవం అతడి అకౌంట్ లో ఒక నెంబరుగా చేరుతుంది. ఆడదానికి ఒక అనుభవం మొహంమీద ఒక ముదతను ఎక్కువ చేస్తుంది. ఇంత చిన్న విషయం తెలుసుకునేసరికి మీ చుట్టూ వున్నవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. మనసుతో ఇక నాటకాలు ఆడలేక, ‘నన్ను నన్నుగా ప్రేమించే.....'అన్న కొత్త స్లోగను మొదలుపెడతారు. మిమ్మల్ని మీరుగా ప్రేమించటానికి మీలో ఏమీ లేదని, మిగిలింది వట్టి చెరుకుపిప్పి అనీ గ్రహించరు. అప్పటికీ మీక్కాస్త హోదా వస్తుంది. దాన్ని మీ ఫ్రస్టేషన్ కోసం ఉపయోగించుకుంటారు. మీరు ఉద్యోగినులైతే క్రింది ఉద్యోగస్తులను చంపుతారు. రచయిత్రులైతే రచనల్లో చూపిస్తారు. రాజకీయాల్లో అయితే మంత్రుల మధ్య తెంపులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. రోజుకి పది గంటలు ఫోన్ దగ్గిరే గడపటం మీ జబ్బుకి మొదటి లక్షణం మీ మొహంమీద ఆనందకరమైన, శుభప్రదమైన నవ్వు వచ్చి చాలా కాలమవటం రెండో లక్షణం. ఈ రెండు లక్షణాలూ నీ కున్నాయని నీకూ నాకూ తెలుసు. ఇప్పుడు చెప్పు ఇదంతా విన్నాక కూడా నీ కింకా కడుపులో తిప్పుతున్నట్టు వుందా?”

February 8, 2018Report this review